KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Wednesday, January 16, 2013

సీమాంధ్రలో ‘విభజన’ కలకలం

హుటాహుటిన ఢిల్లీకి ఆ ప్రాంత మంత్రులు మంగళవారమే ఢిల్లీ వెళ్లిన ఐదుగురు.. నేడు మరికొందరు ఢిల్లీ బాటలోనే ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు అధిష్టానం ‘ఆలోచనలను’ అడ్డుకోవడమే లక్ష్యం మూకుమ్మడి రాజీనామాల హెచ్చరికలకూ సిద్ధం  రాష్ట్రంలో సర్కారు కుప్పకూలుతుందని స్పష్టం చేయనున్న నేతలు  సోనియా, ప్రధానితో అపాయింట్‌మెంట్ల బాధ్యత ఎంపీలకు 17న సమావేశంలో విభజనకు వ్యతిరేకంగా తీర్మానం   తెలంగాణ అంశంపై ఢిల్లీలో కదలికల నేపథ్యంలో కోస్తా, రాయలసీమ కాంగ్రెస్ నేతల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. రాష్ట్ర విభజన దిశగా కేంద్రం ఆలోచనలు సాగిస్తోందన్న సమాచారంతో.. ఒకవేళ నిర్ణయం వెలువడితే ఆ తర్వాత చేసేదేమీ ఉండదనే భావనతో.. కింకర్తవ్యంపై దృష్టిసారించారు. అధిష్టానం పెద్దలను కలిసేందుకు హుటాహుటిన హస్తినకు పయనమయ్యారు. మంగళవారం రాత్రి మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, పినిపె విశ్వరూప్ ఢిల్లీకి వెళ్లారు. మంత్రులు వట్టి వసంతకుమార్, గంటా శ్రీనివాసరావులతో పాటు మరికొందరు బుధవారం ఉదయం వెళ్లనున్నారు. వీరితోపాటు కొంతమంది ఎమ్మెల్యేలూ, ఇతర ముఖ్యులు కూడా హస్తిన బాటపడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్, వయలార్ రవి, అహ్మద్‌పటేల్ తదితరులతో వీరు భేటీ కానున్నారు. ఆయా నేతల అపాయింట్‌మెంట్లను తీసుకొనే బాధ్యతను ఇప్పటికే ఢిల్లీలోని ఎంపీలకు అప్పగించారు. రాష్ట్రం నుంచి వస్తున్న సీమాంధ్ర ప్రాంత నేతల కోసం ఢిల్లీలో బస ఏర్పాట్లు కూడా జరిగాయి. తెలంగాణపై పార్టీ పెద్దల ఆలోచనలకు సంబంధించి ఎంపీల నుంచి సమాచారం రావడం, వెంటనే అందరూ ఢిల్లీకి చేరుకోవాలనే పిలుపు అందడంతో వీరంతా వేగంగా స్పందించారు.

తెలంగాణకు అనుకూలంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక చేయడానికి ఏమీ ఉండదని, ముందే తమ అభ్యంతరాన్ని, వైఖరిని గట్టిగా తేల్చిచెప్పాల్సిన అవసరముందన్న అభిప్రాయంతో ఢిల్లీ వెళ్తున్నామని రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రులు చెప్పారు. రాష్ట్ర విభజన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, తెలంగాణ ప్రకటిస్తే కనుక రాష్ట్రంలో ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని స్పష్టం చేయనున్నామని వివరించారు. తెలంగాణకు అనుగుణంగా రోడ్‌మ్యాప్ ప్రకటిస్తే కనుక మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా సీమాంధ్రలోని ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేయకతప్పదని వీరు చెప్పనున్నారు. తమ అభిప్రాయాలు వినకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని విజ్ఞప్తి చేయనున్నారు. ఒకవేళ తీసుకుంటే ఇరుప్రాంతాల్లో వైషమ్యాలు పెరగడంతో పాటు దేశంలో విచ్ఛిన్నవాదాలు బయలుదేరతాయని వివరించనున్నారు. ‘‘ఢిల్లీ పెద్దల వైఖరి చూస్తుంటే రాష్ట్ర విభజన దిశగానే వారి ఆలోచనలు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. సీమాంధ్రలో ఎలాంటి ఉద్యమాలు లేవని, ఎవ రికీ అభ్యంతరాలు లేవని కొందరు తెలంగాణ నేతలు అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు అక్కడ ఉద్యమాలు ఎందుకుంటాయి? విడదీయాలని చూస్తే మాత్రం పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కుతాయి. వాటిని అడ్డుకోవడం ఎవరితరమూ కాదు. అక్కడ ఎవరూ మాట్లాడడం లేదన్న సాకుతో విడదీస్తామంటే ఎలా? మాతో మాట్లాడాల్సిన పనిలేదా? మేం చెబుతున్న విషయాలను పట్టించుకోరా?’’ అని కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి ఒకరు ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ముందుగా నష్టపోయేది రాయలసీమ ప్రాంతమేనని, దాదాపు 13 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకమవుతుందని ఆయన అన్నారు. సమైక్యంగా ఉన్నప్పుడే తాము తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని, విడిపోయాక తమ మొర ఆలకించే వారెవరని ప్రశ్నించారు. ఈనెల 18వ తేదీనుంచి జైపూర్‌లో జరగనున్న పార్టీ మేధోమథన సదస్సులో తెలంగాణ అంశం చర్చకు వచ్చి అందులో సానుకూల ప్రసంగాలు సాగితే ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందువల్ల ముందుగానే నిరసన గళం విప్పడం మంచిదన్న భావనకు వచ్చామని పార్టీ సీనియర్ నేత ఒకరు వివరించారు.

2009 డిసెంబర్ 9నాటి ప్రకటన కూడా పార్టీ అధిష్టానం ఎవరితోనూ చర్చించకుండా చేసినందునే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇప్పుడు తమ అభ్యంతరాలు వినకుండా నిర్ణయం తీసుకుంటే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణతో పాటు అన్ని డిమాండ్లపైనా రెండో ఎస్సార్సీని ప్రకటి స్తే తమకు సమ్మతమేనని వివ రించనున్నట్లు సీనియర్ మంత్రి ఒకరు చెప్పారు. ‘‘తెలంగాణకు విడదీసి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉంచుతారని మంత్రి దానం నాగేందర్ పేర్కొంటున్నారు. ఈ ప్రతిపాదనకు కూడా మేము అంగీకరించేది లేదు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని స్పష్టంగా చెబుతాం. రాష్ట్రమక్కడ ఉండి ఇక్కడనుంచి పాలన అంటే సాధ్యమా? హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఇక తమ పదవులు ఉండవని, కేవలం కార్పొరేటర్ల రాజ్యమే నడుస్తుందని దానం భయపడుతున్నట్లున్నారు. అందుకే ఇప్పుడిలా మాట్లాడుతున్నారు’’ అని అన్నారు. తెలంగాణపై కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చిందని నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు అన్నారు. ‘‘హైదరాబాద్‌ను రెండు ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా కొన్నాళ్లు ఉంచుతున్నట్లుగా చెప్పి తెలంగాణ ఇస్తారనే సమాచారం ఉంది. సీమాంధ్ర నేతలు ఇప్పుడు చేస్తున్న హడావుడి మొత్తం కేవలం మా ప్రాంతంలో వాళ్ల ఉనికిని, పార్టీ ఉనికిని కాపాడుకొనేందుకే. తెలంగాణ రాకుండా గట్టిగా అడ్డుపడ్డామని చెప్పుకొనేందుకే ఈ హడావుడి తప్పించి ఇంకేమీ లేదు. ఢిల్లీలో మొత్తం రోడ్‌మ్యాప్ సిద్ధమై ఉంది’’ అని ఆ నేత వివరించారు.

విభజనకు వ్యతిరేకంగా తీర్మానం!

గురువారం మంత్రుల క్వార్టర్లలో నిర్వహించే సమావేశంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఈ మేరకు తీర్మానం ప్రతిని సిద్ధం చేశారు. మాజీ మంత్రి ఒకరు ఈ తీర్మానంలో పొందుపర్చాల్సిన అంశాలపై కసరత్తు నిర్వహించారు. తెలంగాణ ఇవ్వడం వల్ల ఈ ప్రాంతంలోనే కాకుండా దేశంలోని ఇతర రాష్టాల్లో కూడా వేర్పాటువాదం జోరందుకుని ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని తీర్మానంలో స్పష్టం చేయనున్నారు. దేశం ఛిన్నాభిన్నమయ్యే ప్రమాదముందని, చివరకు సమగ్రతకే ముప్పువాటిల్లుతుందని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ, సీమాంధ్రల నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యాక.. కేవలం తెలంగాణ ప్రాంత ప్రతినిధి సురేష్‌రెడ్డి వాదననే కాంగ్రెస్ అభిప్రాయంగా కేంద్ర హోం మంత్రి షిండే పరిగణనలోకి తీసుకోవడంపైనా అభ్యంతరం వ్యక్తం చే యనున్నారు. సురేష్‌రెడ్డి అభిప్రాయమే కాంగ్రెస్ అభిప్రాయమైనప్పుడు ఆయన ఒక్కరినే అఖిలపక్షానికి పంపిస్తే సరిపోయేదని, ఇప్పుడైనా తమ అభిప్రాయాలు వినకుండా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని స్పష్టం చేయనున్నారు. ఈ మేరకు ఆమోదించిన తీర్మానాన్ని సోనియాకు అందజేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే హాజరవుతారని, ఎంపీలు ఢిల్లీలోనే ఉంటారని చెబుతున్నారు. తెలంగాణపై కేంద్రం కదలికలు గమనిస్తూ ఎప్పటికప్పుడు తమ అభ్యంతరాలు చెప్పేందుకు వీలుగా వారక్కడే ఉంటారని మంత్రి ఒకరు వివరించారు.
సోనియాతో డీఎస్ భేటీ: ఇలా ఉండగా పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ మంగళవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సోమవారం కూడా ఆయన సోనియాతో సమావేశమయ్యారు. ఈ రెండు దఫాల భేటీలో తెలంగాణ అంశమే ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో అధ్యక్షురాలి నుంచి స్పష్టమైన వివరాలు వెల్లడవకున్నా ఎక్కువసేపు ఆమె దీనిపై ఎలా ముందుకు వెళ్తే పార్టీకి మేలు జరుగుతుందన్న అంశంపైనే ఆరా తీసినట్లు తెలుస్తోంది.

నేడు ఢిల్లీకి సీఎం, బొత్స

తెలంగాణపై చర్చలు జోరుగా సాగుతున్న సమయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం ఢిల్లీకి బయలుదేరుతున్నారు. జైపూర్ సదస్సుకు ఒకరోజు ముందుగానే వీరిద్దరూ హస్తినలో అందుబాటులో ఉండనున్నారు. తెలంగాణపై తీసుకోవలసిన చర్యలపైనే పార్టీ అధిష్టానం, కేంద్రప్రభుత్వ పెద్దలు వీరితో చర్చించనున్నారని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. కిరణ్, బొత్సలు ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లనున్నారు (Source-saakshi)

No comments:

Post a Comment