శుక్రవారం, 5 ఆగస్టు 2011( 14:04 IST) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న తెలంగాణ సమస్యకు పరిష్కారం తమ చేతుల్లో లేదని, తెలుగు ప్రజల చేతుల్లోనే ఉందని కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం (పీసీ) స్పష్టం చేశారు. అందువల్ల అత్యంత జఠిలమైన, సున్నితమైన తెలంగాణ సమస్య పరిష్కారంపై ఆయన చేతులెత్తేనట్టుగా లోక్‌సభలో ప్రకటించారు. డిసెంబరు తొమ్మిదో తేదీకి ముందు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజనకు అంగీకరించారన్నారు. ఈ మేరకు అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాయన్నారు. ఈ సమావేశం మినిట్స్ ఆధారంగానే డిసెంబరు తొమ్మిదో తేదీన కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసిందన్నారు. ఈ ప్రకటన చేసిన వెంటనే సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉత్పన్నమైందని చెప్పారు. దీంతో సమస్య పరిష్కారం కోసం తాము జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. అయితే, ఈ కమిటీ సమస్యకు పరిష్కారం చూపకుండా ఆరు రకాల సూచనలు చేసిందన్నారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చిందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా, డిసెంబరు తొమ్మిదో తేదీ ప్రకటన తర్వాత రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రెండుగా చీలిపోయి భిన్నాభిప్రాయాలు వచ్చాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలన్నారు. తమ పార్టీలో ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చర్చలు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు.
అలాగే, మిగిలిన రాజకీయ పార్టీలు కూడా చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలన్నారు. అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ యువత ఉద్వేగానికి లోనుకారాదని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ సమస్యకు తెలుగు ప్రజలే ఒక పరిష్కార మార్గాన్ని చూపాలంటూ చిదంబరం తన ప్రసంగాన్ని ముగించారు.
===============================
(source-MSN WEB DUNIA)
No comments:
Post a Comment