శుక్రవారం, 12 ఆగస్టు 2011( 18:38 IST )రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ఉంచే 14 ఎఫ్ నిబంధనను తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టుకు రిట్ పిటీషన్ దాఖలు చేయనున్నట్టు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలు ప్రకటించారు. అలాగే, 14 ఎఫ్ రద్దును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర విద్యార్థి జేఏసీ శుక్రవారం నుంచి విశాఖపట్టణంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. విశాఖ నగర కార్పోరేషన్ భవనం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం దగ్గర విద్యార్థులు దీక్షకు కూర్చొన్నారు. ఈ సందర్భంగా వారు కేంద్ర హోంమంత్రి చిదంబరం దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిపై జేఏసీ కన్వీనర్ కె.శివాజీ మాట్లాడుతూ 14 ఎఫ్‌ను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నివాసాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ఎంపీలపై ఒత్తిడి తెస్తామని వెల్లడించారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ మాట్లాడుతూ 14 ఎఫ్ తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఏ విధంగా నష్టపోతారో.. అదే విధంగా తెలంగాణలోని కొన్ని జిల్లాలకు చెందిన విద్యార్థులు నష్టపోతారన్నారు. అంతేకాకుండా, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసే అధికారం కేంద్రానికి లేదన్నారు. ఒక్క పార్లమెంట్‌కు మాత్రమే ఉందన్నారు. అందువల్ల దీనిపై మళ్లీ సుప్రీంకోర్టు తలుపులు తట్టనున్నట్టు ఆయన తెలిపారు.
==========================================
14 ఎఫ్‌పై సీమాంధ్ర నేతలు రాద్ధాంతం చేయొద్దు: పొన్నం
14 ఎఫ్ రద్దుపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలు రాద్ధాంతం చేయవద్దని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. 14 ఎఫ్‌ను రద్దు చేస్తూ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. దీనిపై ఎంపీ పొన్నం స్పందిస్తూ 14 ఎఫ్ రద్దును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఇపుడు సీమాంధ్ర నేతలు దీనిపై రాద్ధాంతం సృష్టించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థుల్లో ఎలాంటి అపోహలు సృష్టించొద్దని పేర్కొన్నారు. ఇపుడు 14 ఎఫ్‌ను రద్దు చేసినప్పటికీ.. ఎస్.ఐ రాత పరీక్షలను మాత్రం నెల రోజుల పాటు వాయిదా వేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులంతా ప్రత్యేక, సమైక్య ఉద్యమాల్లో పాలుపంచుకున్నారని అందువల్ల వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పరీక్షలను వాయిదా వేయాలన్నారు.
ఇకపోతే.. తెలంగాణ ప్రాంతానికి చెందిన తెదేపా నేతలు రాజీనామాలు చేసి హడావుడిగా బస్సు యాత్రలు చేశారని, ఇప్పుడేమో కాంగ్రెస్ నేతలు చెబితే రాజీనామాలు చేస్తామనడం సబబు కాదన్నారు. జూలై 4వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబితే రాజీనామాలు చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ తెదేపా ఫోరంపై ప్రజలకు చిత్తశుద్ధి లేదని పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.
=============================
14 ఎఫ్ తెలంగాణ-సీమాంధ్ర సమస్య కాదు: లగడపాటి
14 ఎఫ్ రద్దు అనేది తెలంగాణ-సీమాంధ్ర ప్రాంతాల సమస్య కాదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. 14 ఎఫ్‌ను రద్దు చేస్తూ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. దీనిపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ 14 ఎఫ్ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. ఫ్రీజోన్ నుంచి హైదరాబాద్‌ను మినహాయించి ఆరో జోన్‌లో కలపడం జరిగిందన్నారు. దీనివల్ల ఆరో జోన్ పరిధిలోని యువత మాత్రమే లాభపడతారన్నారు. ఈ విషయాన్ని తాను మొదటి నుంచి చెపుతున్నట్టు లగడపాటి తెలిపారు. ఉదాహరణకు 12 లక్షల పోలీసు ఉద్యోగాలు ఉంటే ఇందులో 11 లక్షల ఉద్యోగాలు ఇతర జిల్లాలకు వర్తిస్తాయని ఆయన తెలిపారు. అందువల్ల 14 ఎఫ్ వల్ల ఇతర జోన్ పరిధిలోని విద్యార్థులకు ఎలాంటి నష్టం లేదన్నారు. ఇకపోతే.. ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ఎస్ఐ రాతపరీక్షలు యధావిధిగా ప్రశాంతంగా జరుగుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
==================================
(Source-MSN WEB DUNIA)
No comments:
Post a Comment