12 ఆగస్టు 2011( 14:19 IST )తెలంగాణవాదులు పట్టిన పంతం నెగ్గించుకున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఫ్రీజోన్ నుంచి తొలగించారు. ఈ ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ఉంచే 14 ఎఫ్ నిబంధనను తొలగిస్తూ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ ఆరో జోన్ పరిధి కిందకు రానుంది. ఈ జోన్‌లో హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ నగర్ జిల్లాలు ఉంటాయి. ఫలితంగా ఇకపై హైదరాబాద్ నగర పరిధిలోని పోలీసుల రిక్రూట్మెంట్‌లలో ఆరో జోన్‌కు చెందిన యువకులు మినహా ఇతర జోన్‌లకు చెందిన యువకులు అనర్హులుగా పేర్కొంటారు. కాగా, ఈ 14 ఎఫ్ నిబంధనపై గత కొంత కాలంగా తెలంగాణ వాదులు రాద్ధాంతం చేస్తున్న విషయం తెల్సిందే. దీన్ని తొలగించకుంటే ఈనెల 13వ తేదీన జరిగే ఎస్ఐ రాతపరీక్షలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, హోం మంత్రి చిదంబరంలతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ప్రధాని నేతృత్వంలోని సమావేశమైన రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ 14 ఎఫ్ నిబంధనను తొలగించాలని కోరుతూ రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. ఈ ఫైలుపై రాష్ట్రపతి శుక్రవారం సంతకం చేయడంతో 14 ఎఫ్ వివాదం ముగిసినట్టుగా భావించవచ్చు.
===============================
14 ఎఫ్ నిబంధన తొలగింపు: తెలంగాణ వాదుల్లో హర్షం!14 ఎఫ్‌ను రద్దు చేస్తూ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తెలంగాణ వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. విద్యార్థులు ఆనందోత్సవాల్లో మునిగి పోయారు. అలాగే, తెలంగాణలోని పలు విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 14 ఎఫ్‌ను రద్దు చేసినంత మాత్రాన తెలంగాణ ఉద్యమం ఆగదని ఏబీవీపీ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. ఈ సందర్భంగా వారు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు.
ఇకపోతే.. 14 ఎఫ్‌ను తొలగించడంలో తెలంగాణ వాదుల విజయముందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు అన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోరాటం చేయడంతో కేంద్రం స్పందించి 14 ఎఫ్‌ను రద్దు చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి, సోనియాకు, ప్రధానికి, చిదంబరంకు ధన్యవాదాలు తెలిపారు. 14 ఎఫ్ రద్దు చేయడంతో తెలంగాణ ప్రాంత యువతకు న్యాయం జరిగిందని మంత్రులు దానం నాగేందర్, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి, సోనియాకు, చిదంబరానికి, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
================================
(Source-MSN WEB DUNIA)
No comments:
Post a Comment