గురువారం, 4 ఆగస్టు 2011( 19:36 IST )
ఈ నెల 8 నుంచి తెలంగాణా ప్రాంత ఉద్యోగ సంఘాలు చేయతలపెట్టిన సకల జనుల సమ్మెపై ప్రభుత్వం ఎస్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. అయితే అంతకంటే ముందే 14 ఎఫ్‌ను రద్దు చేయడం ద్వారా ఉద్యోగులను శాంతింపజేయాలని చూస్తోంది. 14 ఎఫ్‌ను తొలగించినప్పటికీ పట్టించుకోకుండా సమ్మెలో పాల్గొనే ఉద్యోగులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్థిక సేవలను అత్యవసర సేవలుగా భావిస్తూ జీవో నెంబరు 166ను జారీ చేసింది. ఆ శాఖల్లోని వారు సమ్మెలో పాల్గొంటే వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించవచ్చు. దీనితోపాటు మాట వినని ఉద్యోగులపై మరింత పదునైన అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్టికల్ 311ను ప్రయోగించడం ద్వారా సమ్మెలో పాల్గొన్నవారిని ఉద్యోగం నుంచి తొలగించే వీలుంది. మొండిగా వెళ్లేవారిపై ఈ చట్టాన్ని ప్రయోగించాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా తాము ఆగస్టు 8 నుంచి సకల జనుల సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల జేఏసి కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది. తమ ఉద్యోగాలు పోయినా తమకేం బాధ లేదనీ, తమకు తెలంగాణా రాష్ట్రమే ముఖ్యమని వారు వెల్లడించారు.
ఇంకోవైపు నెలవారీ జీతం వస్తే గానీ పూటగడవని ఉద్యోగులు విధులకు హాజరు కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి వారికి తగిన రక్షణ కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. హైదరాబాదులో సుమారు 100 పారామిలటరీ దళాలను మొహరించారు. విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఆగస్టు 8న ప్రారంభించిన సకల జనుల సమ్మె ఆగస్టు 17 నాటికి తీవ్రరూపం దాల్చి తెలంగాణా ప్రాంతాన్నంతా స్తంభింపజేస్తుందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాల్సిందే.
==================================
(SOURCE- MSN WEB DUNIA)
No comments:
Post a Comment