శుక్రవారం, 5 ఆగస్టు 2011( 08:50 IST )
తమ పదవులకు రాజీనామా చేసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల పట్ల కఠిన వైఖరిని అవలంభించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇందులోభాగంగా, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ చేస్తున్న బుజ్జగింపులకు తలొగ్గి దారికొస్తే సరేసరి.... లేకుంటే పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుపై తొలి వేటు వేసి మిగిలిన వారిని దారికి తెచ్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్టు ఏఐసీసీ వర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా టిజాక్ ఇచ్చిన పిలుపు మేరకు టి కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఈ రాజీనామాలను ఉపసంహరించుకోవాలని ఎంతగానో మొత్తుకుంటున్నా వారు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో అధిష్టాన వర్గం ఓ పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది.
వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం నుంచి 32 మంది ఎంపీలు ఉన్నప్పటికీ.. తెలంగాణకు చెందిన తొమ్మిది మంది లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్‌కు లోక్‌సభ సభ్యుల అవసరం అత్యంత అవసరమైనప్పటికీ నేరుగా స్పీకర్‌కు రాజీనామాలను ఇవ్వడం ద్వారా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆగ్రహంతో అధిష్టాన ఉంది. రాజీనామాలను ఉపసంహరించుకోని పక్షంలో ఆమోదాల వేటు వేయక తప్పదన్న అభిప్రాయంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. ఇందుకోసం ఒక రక్షణాత్మక మార్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. ఇందులోభాగంగా తొలుత రాజ్యసభ సభ్యుడు కె.కేశవ రావు రాజీనామాను ఆమోదించడం ద్వారా రాజీనామాలు చేసిన లోక్‌సభ సభ్యులకు హెచ్చరికలు పంపాలన్న ఆలోచనతో అధిష్టానం ఉంది. కేశవరావు రాజీనామాను ఆమోదించడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్‌కు కలిగే నష్టం ఏమీ లేదు.
ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీనే మళ్లీ గెలుచుకుంటుంది. అదే లోక్‌సభ సభ్యుల రాజీనామాలను ఆమోదించినట్లయితే మళ్లీ గెలుచుకుంటామన్న ధీమా కాంగ్రెస్‌కు లేదు. అందుకే కేకేపై తొలి వేటు వేయాలన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ అంశంలో సొంత పార్టీ నుంచి, ప్రతిపక్షాల నుంచి ఎన్ని హెచ్చరికలు వచ్చినప్పటికీ తమపని తాము చేసుకుపోవాలన్న అభిప్రాయంతో పార్టీ నాయకత్వం ఉంది. ఇది అత్యంత జఠిలమైన సమస్య కావడం వల్ల తలదూర్చి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడమెందుకన్న భావనతో ఉంది. పైపెచ్చు.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ.. దానివల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదని తేలిపోయింది. దీంతో ఎంపీల రాజీనామాల పట్ల కాస్త కఠువుగా వ్యవహరించాలని అధిష్టానం భావిస్తోంది.
======================
(Source-MSN WEBDUNIA)
No comments:
Post a Comment