తెలంగాణ సమస్యపై కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులది ఓ విచిత్రమైన పరిస్థితి. అధిష్టానాన్ని వ్యతిరేకించలేక.. అధికారాన్ని, పదవులను వదులుకోలేక సందిగ్ధంతో ఊగిసలాడుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో స్వేచ్చగా తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వినిపించినంత బలంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ వాదనల్ని వినిపించడంలేదని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కొందరు రాజీనామాలు సమర్పించి.. అధిస్టానంపై ఒత్తిడి తీసుకువస్తే మంచిదని అంటే మరికొందరు రాజీనామాలతో ఎన్నికలు వస్తాయి కాని.. తెలంగాణ రాదని ఓ వర్గం విభేధిస్తున్నారు.
మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో భాగంగా రాబోయే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తే ఏ విధంగా ఉంటుందనే అంశంపైనా కసరత్తు చేస్తున్నారు. ఎంపీలు రాజీనామా అస్త్రాలతోనే హైకమాండ్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినందున.. అదే దిశగా త్వరలో మంత్రులు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మంత్రులతో కలిసి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులంతా ఢిల్లీ వెళితే బాగుంటుందని కొందరు సూచించారు. త్వరలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా వెళ్లాలనే అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ మంత్రులతో భేటీ తరువాతనే ఓ నిర్ణయానికి రావాలని తేల్చేశారు. అవసరమైతే రాజీనామాలకు వెనుకాడమనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంచిదని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి పోరాడతామని, రాజీనామాలు సహా ఏ త్యాగానికైనా తాము సిద్ధంగా ఉన్నామని గండ్ర స్పష్టం చేశారు.
నెల రోజుల్లో తెలంగాణపై తేల్చేస్తామని చెప్పిన కేంద్రం నిర్ణయాన్ని వాయిదా వేయడం వల్ల తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ నేతలపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందనే భావనతో ఉన్న తెలంగాణ ప్రజలకు.. కేంద్రం తీరు అశనిపాతంగా మారిందనే విషయాన్ని లేఖ ద్వారా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దృష్టికి తీసుకువెళ్లాలని తాజా భేటిలో నేతలు నిర్ణయించారు. తెలంగాణ కోసం వందలాది మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, సత్వరమే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆ లేఖలో కోరుదామని నిర్ణయం తీసుకున్నారు.
వివిధ రూపాల్లో ఒత్తిడి తేవాలనే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడటం, లేఖలు రాయడానికే పరిమితవుతున్నారని తెలంగాణవాదుల ఆరోపణ. రాబోయే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేయడంతో పాటు అవసరమైతే రాజీనామాలు చేస్తే ఏ విధంగా ఉంటుందనే అంశంపై చర్చలు జరపడం మినహా తాడోపేడో తేల్చుకోవడంపై కాంగ్రెస్ నేతలకు వెనకంజ వేస్తున్నారని ఇతర పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. హడావిడిగా సమావేశాలు పెట్టడం, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం, భవిష్యత్ కార్యాచరణ కోసం మరోసారి భేటి అవుతామని ఊక దంపుడు ఉపన్యాసాలు చెప్పడం వినేవారికి, చూసేవారికి విసుగు తెప్పిస్తొంది. ఇలాంటి చవకబారు రాజకీయాలకు స్వస్తి చెప్పి.. ప్రజల, యువకుల్లో ఆత్వవిశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలకు కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత నేతలు ఇకనైనా పుల్ స్టాప్ పెడితే మంచిదని పలువురు సూచిస్తున్నారు.
(Source-saakshi)
|
No comments:
Post a Comment